అలాగే అదే పాటలో - చూశాక నిన్ను వేశానే కన్ను - అని ఇంకో
వాక్యం వుంది. కన్ను వెయ్యడం అంటే ఇప్పుడు మనం వాడుతున్న అర్ధం వేరు. అక్కడ
సిరివెన్నెల ప్రయోగించిన అర్ధానికి పరమార్ధం వేరు. గవ్వలతో ఆడే అష్టా
చెమ్మా ఆటలో గవ్వ వెల్లకిలా పడితే అది కన్నులా వుంటుంది. దాన్ని ’కన్ను
పడడం’ అని అంటారు. ఇంత లోతుగా మథనం చెందుతారు కనుకనే సిరివెన్నెల తన సహ రచయితలతో ’గురువు గారు’ అనిపించుకునే స్థానంలో వున్నారు.
ఈ
2014 మే 20 కి 59 పూర్తి చేసుకుని 60వ సంవత్సరంలో కాలుపెట్టిన సిరివెన్నెల -
పాటల్లో పదాలు సరైన చోట ఆపి పాడకపోతే భాష ఎటువంటి ఇబ్బందికి గురవుతుందో వివరించారు " నేను - ఈ మనసు ’ఆగేదెలా’ అని రాశాననుకోండి.
పాడేవాళ్ళు ’ఆ’ దగ్గిర ఆపి పాడితే ఏమవుంది ? ’ ఆ గేదెలా - ఆవులా పందిలా’తయారవుతుంది.
అలాగే నేను ’కల్లోలంగా’ అని రాస్తే దాన్ని విడగొడితే ’
కల్లో (కలలో) లంగా’ అంటూ వేరే అర్ధం ధ్వనిస్తుంది. అందుకే పాటలో పదాలు ఏది
ఎందుకు రాశామో అని తెలుసుకోవడంతో పాటు ఏది ఎక్కడ ఎలా ఆపితే ఎలా
వినిపిస్తోందో ఎలా అనిపిస్తోందో గమనించుకుంటూ ఉండాలి" అని అన్నారు.