(సెప్టెంబర్ 7న భానుమతి జయంతి సందర్భంగా)
భానుమతి ...
ఈ తరంలో కొంతమందికి ఆమె పేరు మాత్రమే తెలుసు. మరికొంతమందికి నటిగా, గాయనిగా
మాత్రమే తెలుసు. కానీ ఆమె గురించి తెలుసుకోవలసినవి ఎన్నో వున్నాయి.
ఓ సారి ఓ ఫిల్మ్ ఫాన్ అసోసియేషన్ వారు ఆమెను ఆ సంవత్సరానికి ఉత్తమ నటి గా
ఎన్నుకుని, ఆ విషయాన్ని ఆవిడ ఇంటికి వెళ్ళి తెలియజేశారు. ఆవిడ ఎగిరి
గంతెయ్యలేదు. 'చాలా థాంక్సండీ .. నా జీవితంలో ఇదో మరపురాని మధుర ఘట్టం '
అంటూ లేనిపోని వంకర్లు పోలేదు. 'యూ గాట్ ఎ గుడ్ టేస్ట్ (మీకు మంచి అభిరుచి
వుంది)' అని అన్నారు. దటీజ్ భానుమతి.
'ఆత్మవిశ్వాసం' ఆమె దగ్గరున్నందుకు గర్వంగా ఫీలవుతుంది. అంచేత అది ఆమెకి చెందిన గర్వం అని అనుకుంటారంతా.
సినీ పరిశ్రమ సాంకేతికంగా అంత అభివృద్ధి చెందని రోజుల్లోనే - ఒక వైపు
ఎన్టీయార్, ఎస్వీఅర్, రేలంగి వంటి దిగ్గజాల్ని డీల్ చేస్తూ - మరోవైపు
ద్విపాత్రాభినయం చేస్తూ, 'చండీరాణి' అనే చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో
ఏకకాలం లో దర్శకత్వం కూడా వహించిన ఘనత ఆమెది.
భానుమతి పక్కన నటిస్తే హీరోగా తన రేంజ్ పెరుగుతుందని అక్కినేని నాగేశ్వర
రావు భావించేవారు. అంతేకాదు 'నా నటజీవితంలో అత్యంత తృప్తినిచ్చి, నటుడిగా
నన్నొక పరీక్ష గురిచేసి గెలిపించిన ఆణిముత్యాల్లాంటి లైలా-మజ్ఞు,
విప్రనారాయణ, బాటసారి వంటి చిత్రాలను ఇచ్చారావిడ. మా స్వంత సంస్థ అయిన
అన్నపూర్ణ సంస్ఠ లో కూడా నాకంత మంచి పాత్రలు లభించలేదు' అని చెప్పేవారు
భానుమతి గురించి.
'లైలా-మజ్ఞు' తీసే రోజుల్లో 'నాగేశ్వర రావు మజ్ఞు యేంటి ... వాడి మొఖం' అని
నేరుగా భానుమతినే ప్రశ్నించేరు కొంతమంది. 'మరెవరున్నారు ... నాగయ్య గారిని
పెట్టమంటారా ? చెప్పండి ?' అని ఆ విమర్శించిన వాళ్ళ నోళ్ళు మూయించారామె.
'లైలా-మజ్ఞు' తీసే రోజుల్లోనే అక్కినేనిని పికప్ చేసుకోవడానికి ఓ రోజు
వచ్చి ఆ వీధిలో చేపల వాసన వస్తుంటే భరించలేక - తమ దగ్గర ప్రొడక్షన్ మేనేజర్
గా వర్క్ చేసిన డి.యల్. నారాయణ (తర్వాత నిర్మాత అయి 'దేవదాసు'తీశారీయన)
ఇల్లు ఖాళీ చేయించి రాత్రికి రాత్రే ఆయన్ని దింపారావిడ.
తను భరించలేనిది ఎంత గొప్పదైనా వదులుకోవడానికి ఏ మాత్రం సంకోచించే తత్వం
భానుమతి గారిది కాదని, అందుకు ఉదాహరణగా ఘంటసాల గారికి చుట్ట అలవాటుండడం చేత
ఏసీ రూమ్ లో ఆయనతో పాడలేక తన స్వంత సంస్థ అయిన భరణిలో ఏయన్నార్, ఎన్టీయార్
లకు సైతం - ఏ.ఎం. రాజా, పి.బి. శ్రీనివాస్ వంటి వారితో ఆవిడ ప్లేబ్యాక్
పాడించేవారని చెప్పుకునేవారు ఆ రోజుల్లో.
పాత్ర కోసం తన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని ఒదులుకోవడానికి ఏ మాత్రం
సిద్ధపడేవారు కాదామె. అందుకే పెద్ద పెద్ద హీరోలు సైతం రొమాంటిక్ సీన్స్ లో
ఆమె భుజం మీద చెయ్యవెయ్యడానికి కూడా సంకోచించేవారు. ఒకటికి రెండు సార్లు
ఆలోచించేవారు. మరో విచిత్రమైన ఉదాహరణ ఏమిటంటే - 'విప్రనారాయణ' సినిమాలో
విప్రనారాయణుడి(ఏయన్నార్) కాళ్ళు కడిగిన నీళ్ళు దేవదేవి (భానుమతి) నెత్తిన
జల్లుకునే సన్నివేశం ఒకటుంది. దానికావిడ ససేమిరా ఒప్పుకోలేదు. ఆవిడ భర్త, ఆ
చిత్ర దర్శకుడు రామకృష్ణ గారు ఎలాగోలా ఒప్పించారు. షాట్ లో ఆ నీళ్ళు
నెత్తిన జల్లుకుంటున్నంత సేపూ - నా ఖర్మ కాలిపోయింది నా ఖర్మ కాలిపోయింది -
అని నాగేశ్వరరావు గారికి విపిపించేలా అంటూనే వున్నారటావిడ. ఈ విషయం
అక్కినేని వారే తన క్లోజ్ సర్కిల్ లో చెప్పేవారు.
భానుమతి మంచి కథకురాలు. ఆవిడ రాసిన 'అత్తగారి కథలు' కి సాహిత్య అకాడమీ
అవార్డు లభించింది. నటుడు చలం 'మట్టిలో మాణిక్యం' సినిమా తీద్దామనికుని తన
తల్లి పాత్రకి భానుమతి ని ఎంచుకున్నారు. తీరా కథంతా తయారయ్యే సరికి అంత
తృప్తిగా రాలేదనిపించింది. మొత్తం తీసుకు వెళ్ళి భానుమతి గారి చేతిలో
పెట్టేసి 'అమ్మా ఇదీ విషయం. మీరేం చేసినా కాదనను. ఇక మీదే భారం ' అన్నారు.
ఆవిడ సరేనని మొత్తం చదివి, తల్లి పాత్రని వదిన పాత్రగా మార్చి, తన పాత్రకు
సంబంధించిన డైలాగులన్నీ తిరగ రాసుకున్నారు. ఇక సినిమాలో ఆవిడ పాత్ర ముందు
మిగిలిన పాత్రలన్నీ డల్ అయిపోయాయి. ఆవిడ పాత్రే హైలెట్. భానుమతి కోసమే ఆ
సినిమాని మళ్ళీ మళ్ళీ చూశారు. అదీ రచయిత్రిగా ఆవిడ సాధించిన విజయం.
ఇవన్నీ ఇలా వుండగా భానుమతి గారికి సంబంధించి కొందరికి మాత్రమే తెలిసినవి ఓ
రెండు విషయాలున్నాయి. ఆవిడ సంగీతం నేర్చుకుంది. అందుకు గురుభక్తి తో ఆ
త్యాగరాజ స్వామిని తలచుకునేలా భరణీ వారు తీసిన ప్రతి చిత్రంలోనూ వీలైనంత
వరకూ ఓ త్యాగరాజ కీర్తనను ఆలపిస్తానని తన తండ్రికి మాట ఇచ్చారావిడ. అలాగే
భరణీ వారి చిత్రాలలో అవకాశం ఉన్నంత మేరకు త్యాగరాజ కీర్తనను ఆలపిస్తూ
వచ్చారామె.
తర్వాతి రోజుల్లో భానుమతి జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు.
అమెరికాలో స్థిరపడిన తన కుమారుడు భరణి ఒక్కసారి వచ్చి వెళ్ళమని తెగ వత్తిడి
చేసేవాడు. 'ప్రస్థుతం పీరియడ్ బాగులేదురా' అంటూ సున్నితంగా
తిరస్కరించేవారావిడ. 'ఈ రోజుల్లో కూడా ఏమిటమ్మా ఇంత చాదస్తం' అంటూ
టిక్కెట్ కొనేసి పంపించేశాడాయన. బయలుదేరక తప్పలేదు. అమెరికాలో వుంటుండగానే
రామకృష్ణ గారికి సుస్తీ చేసింది. వెళ్ళిన కొద్దిరోజులకే అక్కడే
మరణించారాయన. 'నాకు తెలుస్తూనే వుంది ఏదో చెడు జరగబోతోందని. దాని ఫలితమే -
జంటగా వెళ్ళిన వాళ్ళం ఒంటిగా వచ్చాను' అనేవారావిడ ఎంతగానో బాధపడుతూ.
Comments
Post a Comment