సూళ్ళురుపేట
మంగళంపాడులో 1921వ సంవత్సరం మే ఏడవ తేదీన జన్మించారు ఆత్రేయ. మే ఏడవ తేదీ
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం. 'నిజమా?' అని అడిగితే 'అవును...
కావాలనే ఆ తేదీ చూసుకు మరీ పుట్టాను' అంటుండే వాడాయన సరదాగా.చిన్నప్పుడు
చదువు మీదకన్నా, నాటకాల మీదనే ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు. ఓసారి ఓ నాటకంలో
మీసాలు గొరిగించుకుని నటించాడని ఇంటికి వచ్చాక గోమూత్రం తాగించి
ప్రాయశ్చిత్త సంస్కారం చేశారు. అంత సంప్రదాయబద్ధమైన కుటుంబం ఆయనది. ఆత్రేయ
అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. గోత్రనామం ఆత్రేయ కనుక ఆ పేరునే
తన పేరుగా ధరించాడాయన.ఓసారి
ఓ మిత్రుడు ఆయనకి తను రాసిన కందపద్యాలు తెచ్చిచూడమన్నాడు. ఆత్రేయకు అర్ధం
కాలేదు. 'ఏం చేయాలి' అని అడిగాడు మేనమామని. ఆయన కందపద్య లక్షణాలున్న ఓ
పుస్తకాన్ని ఆత్రేయకి ఇచ్చి చదివి వంటపట్టించుకోమన్నాడు. ఆత్రేయ ఆ
లక్షణాలన్నీ ఆకళింపు చేసుకుని - 'నువ్వు చేసిన తప్పులు ఇవీ' అని ఆ
మిత్రుడికి అతని తప్పుల్ని కంద పద్యంలోనే రాసి చూపించాడు.
ఇది
తెలుసుకున్న ఆత్రేయ మేనమామ 'ఒరే ....నువ్వు స్కూల్ ఫైనల్ పాసైతే నీకు
సైకిల్, రిస్ట్ వాచీ, కొనిస్తాను' అన్నాడు. అంతే... వెంటనే మిత్రుల
దగ్గరకెళ్ళి పాఠ్యపుస్తకాలన్నీ కాపీ చేశాడు ఆత్రేయ. అలా రాస్తుండగానే సగం
పాఠాలు ఆయనకి కంఠోపాఠంగా వచ్చేశాయి. స్కూల్ ఫైనల్ పాసై మేనమామ ఇచ్చిన
రిస్ట్_వాచీ పెట్టుకుని సైకిలెక్కి ఊరంతా గర్వంగా తిరిగాడు.అయినా
సరే 'నాలైను వేరే ఉంది' అని ఎప్పుడూ అనుకునేవాడు మనసులో. ఒకసారి రాజన్ అనే
మిత్రుడి సాయంతో ఇంట్లోని వెండిగ్లాసు దొంగిలించి మద్రాసు బండెక్కాడు.అక్కడ
పడరాని అగచాట్లు పడ్డాడు. సబ్బులు అమ్మేవాడు. ఉన్ననాడు భోజనం - లేనినాడు
కుళాయి నీళ్ళు. రాత్రిళ్ళు మద్రాసులోని మన్రో విగ్రహం దగ్గర పడుకునేవాడు.
ఓసారి ఓ పావలా ఎక్కువ ఉందనిపిస్తే ఓ నోటుబుక్ కొని వీధి దీపం కింద కూర్చొని
'గౌతమబుద్ధ' అనే నాటకం రాసి యాభై రూపాయలకు అమ్మాడు. ఆ రోజుల్లోనే
సినీనటుడు రమణారెడ్డితో పరిచయం ఏర్పడింది. టిఫెనుకీ, భోజనానికీ, పావలా,
బేడా రమణారెడ్డి ఇచ్చేవాడు ఆత్రేయకి.
ఇలా
ఉండగా 'తెనాలి రామకృష్ణ సినిమాలో వేషం ఉంది వేస్తావా' అని అన్నాడో
పరిచయస్తుడు. సరేనని వెళ్ళి అక్కడ పడేసిన గుడ్డలు, బకెట లో వేసుకోవలసిన
రంగునీళ్ళు చూసి నచ్చక వెనక్కి వచ్చేశాడు.ఆ
తర్వాత 'షావుకారు' చిత్రంలో డైలాగులు రాయడానికి కుదిరాడు. కానీ ఆరోగ్యం
సహకరించక ఆయనే ఒద్దనుకున్నాడు. కొన్నాళ్ళకు 'మనోహర' చిత్రంలో డైలాగ్
అసిస్టెంట్_గా మాట సాయం చేశాడు. ఎట్టకేలకి 'దీక్ష' చిత్రంలో 'పోరాబాబు పో'
పాట రాసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇక ఆయన చేతికి విశ్రాంతే లేకుండా
పోయింది.కొన్ని
వందలు, వేలు పాటలు, మాటలు రాసిన ఆత్రేయ దర్శకుడిగా 'వాగ్దానం' చిత్రానికి
దర్శకత్వం వహించాడు. నటుడిగా 'కోడెనాగు' చిత్రంలో నటించాడు.ఆత్రేయ మంచి హ్యూమనిస్టే కాదు, చక్కని హ్యూమరిస్ట్ కూడా!పాటల
రచయితగా లబ్ధప్రతిష్టుడైన సినారె తొలిసారి 'ఏకవీర' చిత్రానికి మాటలు
రాశారు. 'ఏకవీర' విశ్వనాథ సత్యనారాయణ గారి రచన. అంచేత ఆయన స్టాండర్డ్ కి
తగ్గకుండా కఠినమైన సమాసాలు, పదాలతో సినారె సంభాషణలను రాశారు. సినిమా
ప్రీవ్యూ అయిపోయాక 'చాలా బాగా రాశావు నారాయణ రెడ్డీ ... తెలుగులో రాసుంటే
ఇంకా బావుండేది' అన్నారు ఆత్రేయ. ఆ మాటల్లోని చురక ఆయన వెళ్ళిన ఓ అరగంటకి
గానీ అర్ధం కాలేదు అక్కడున్న మిగిలినవారికి.
ఆత్రేయ
జుట్టుకి రంగు వేసేవారు. ఓసారి వేటూరి 'మీరు ఏ హెయిర్ డై వాడతారో చెప్పండి
... నేను కూడా మొదలెడదామనుకుంటున్నాను' అని అడిగారు. ఆత్రేయ ఓ కాగితమ్మీద
తన హెయిర్ డై పేరు రాసిచ్చారు. కొన్నాళ్ళ తర్వాత ఆత్రేయ, వేటూరి ఒకరికొకరు
ఎదురుపడ్డారు. వేటూరి జుట్టు నల్లగా వుంది, ఆత్రేయ జుట్టు ముగ్గుబుట్టలా
తెల్లగా అయిపోయింది. 'అదేంటండీ మీ జుట్టు అలా అయిపోయింది ?' అని
ఆశ్చర్యపోయారు వేటూరి. 'నువ్వు రాయడం మొదలుపెట్టాక నేను రాయడం మానేశానయ్యా'
అన్నారు ఆత్రేయ - వేటూరి వచ్చాక తనకు పాటలు రాసే అవకాశాలు తగ్గిపోయాయన్న
విషయాన్ని- నర్మగర్భంగా చెబుతూ .దీపావళికి
బాణాసంచా కొనడానికి బజారుకి వెళితే అక్కడ టపాకాయలు కొంటూ వేటూరికి
కనిపించారు ఆత్రేయ. 'అదేంటి ఆత్రేయ గారు ... మీరు టపాకాయలు కూడా కాలుస్తారా
?' అని అడిగారు వేటూరి. 'మరేం చెయ్యమంటావయ్యా ... నా పాట కాయలన్నీ నువ్వు
లాగేసుకుంటుంటే ' అన్నారు అత్రేయ చలోక్తిగా
ఓసారి
ఓ సినిమా హాల్లోంచి బైటికి వస్తున్న ఆత్రేయను చూసి ఆశ్చర్యపోతూ
'ఆత్రేయగారూ మీరు సినిమా చూశారా?' అని అడిగాడీ వ్యాసకర్త. అంత చెత్త సినిమా
అది. దానికి ఆత్రేయ 'లేదు నాయనా... భరించా' అన్నాడు తడుముకోకుండా.మరోసారి
ఆత్రేయ తన అడ్రసుని ఇదే వ్యాసకర్తకి తన అడ్రసుని రాసి ఇచ్చేడు. అది చూసి
అతను 'అరె... ఇది సుశీలగారు ఉండే వీధే కదండీ... ఆవిడ మీ ఇంటికి దగ్గరేనా?'
అని అడిగాడు. 'అవును... ఇది వరకు ఆవిడ మా పక్కింటి అమ్మాయి, ఇప్పుడు
ఎదురింటి అమ్మాయి' జవాబిచ్చాడు ఆత్రేయ చమత్కారంగా.'అంటే.... ఆవిడ మారేరా.. మీరు మారేరా?' తిరిగి ప్రశ్నించాడీ వ్యాసకర్త.'మారేదెప్పుడు ఆడవాళ్ళే...
ఊ...ఊ....ఊ....మ్మగమాళ్ళు మారరు' అని
అన్నాడు ఆత్రేయ అక్కినేని నాగేశ్వరరావుగారిని ఇమిటేట్ చేస్తూ.ఆత్రేయ అంటే చంద్రుడు అని అర్థం. అది తెలియని ఒకాయన 'ఆత్రేయ అంటే
ఏమిటండీ?' అని అడిగాడు. దానికి ఆత్రేయ సమాధానం - రాత్రేయుడు'.ఆత్రేయ
'వాగ్దానం' చిత్రానికి డైరెక్ట్ చేసే రోజుల్లో ఓసారి సెట్_లో అక్కినేని
నాగేశ్వరరావుగారితో సహా అందరూ రెడీ అయి కూర్చున్నారు. ఆత్రేయ మాత్రం ఎక్కడా
అయిపులేడు. ఆఖరికి అక్కినేని అటూ ఇటూ తిరిగి ఆత్రేయని పట్టుకున్నారు.
ఎవరికీ కనిపించకుండా ఓ మూల కూర్చుని అప్పుడు చిత్రీకరించవలసిన డైలాగులు
రాసేసుకుంటున్నాడాయన. 'ఏంటండీ ఇది.... ఏంటీ పని?'' అని మందలించారు
అక్కినేని.
'అదికాదు నాగేశ్వరరావు గారూ... అందరికీ లేటుగా ఇచ్చి నా సినిమాకి
నేను ముందుగా డైలాగులు రాసేసుకుంటే 'స్వార్ధం' అని ప్రొడ్యూసర్లు
తిట్టుకోరూ... ఆ పార్షియాలిటీ లేకుండా జాగ్రత్త పడుతున్నానండీ'' అన్నాడాయన
వస్తున్న నవ్వుని ఆపుకుని సీరియస్ నెస్_ మొహం మీదకు తెచ్చేసుకుంటూ.ఆత్రేయ రాసుకునే టైము తెల్లవారు జామున మూడు లేక నాలుగు, రాసిన
వాటిని తెలుగులో టైపు చెయ్యడానికి ఓ అసిస్టెంట్_ని పెట్టుకున్నాడు. ఈయన
రాసి పంపిస్తూనే ఉన్నాడు. పక్కగదిలోంచి టైపు శబ్దం అస్సలు వినిపించడం లేదు.
'ఏం టైపు చేస్తున్నావ్?' అరిచాడు ఆత్రేయ. 'సీన్లండీ' అన్నాడతడు ఉలిక్కిపడి లేచి.
'ఏం టైపు చేస్తున్నావ్?' అరిచాడు ఆత్రేయ. 'సీన్లండీ' అన్నాడతడు ఉలిక్కిపడి లేచి.
'అదే ఏ సీన్లూ అని...? అసలు శబ్దమే వినిపించడం లేదు'
'సైలెంట్ సీన్లండీ' అన్నాడా అసిస్టెంట్ బహు చమత్కారంగా.
ఆత్రేయతోటి సాంగత్య వైభవం అంతటిది మరి.
ఆత్రేయ రాయకుండా ప్రొడ్యూసర్లని, రాసి ప్రేక్షకులని ఏడిపిస్తారని ఓ
సినీ సూక్తి. దాని గురించి ఆయనతో ప్రస్తావిస్తే ''రాస్తూ నేనెంత
ఏడుస్తానో, ఎవడికి తెలుసు'' అంటుండేవాడాయన ఛలోక్తిగా.
అలాగే ''మీరు మనసు మీదనే ఎక్కువ రాస్తారెందుకండీ?'' అని అడిగితే 'మనసు మీద మనసుపడ్డా నాయనా' అంటుండే వారు నర్మగర్భంగా.
చివర్న చెప్పుకోవలసింది, కళ్ళను చెమ్మగిల్లేట్టు, మనసును గిల్లేట్టు చేసే ఓ జోకు ఆయనది ఉంది.
''నాకూ, చావుకి అస్సలు పడదు. నేనున్న దగ్గరికి అది రాదు. అదొస్తే నేనుండను''
అదీ ఆత్రేయంట ఆత్రేయ జీవకవి. మనిషి మనసులో మమత చావనంత వరకూ అనుక్షణం ఓ అనుభూతిగా ఆయన పుడుతూనే ఉంటాడు.
- రాజా (మ్యూజికాలజిస్ట్)
Comments
Post a Comment