రఫీ పై ఓ.పి.నయ్యర్ కోపం

ఉత్తరాది సంగీత దర్శకుడు ఓ.పి. నయ్యర్ గురించి తెలియని సినీ సంగీత ప్రియులుండరనే చెప్పాలి. ఆయన అటు రఫీ తో, ఇటు ఆశాతో , మరో పక్క ఇద్దరితోనూ ఇచ్చిన హిట్స్ కి కొదవలేదు. ఆయన తన జీవిత కాలంలో లతా మంగేష్కర్ తో ఒక్క పాట కూడా పాడించలేదు.  ఆ రోజుల్లో లతా తో పాడించని సంగీత దర్శకుడుఒక్క ఓ.పి. నయ్యర్ మాత్రమే. ’ఎందుకూ ?’ అనేది ఓ బేతాళ ప్రశ్నలాగే మిగిలిపోయిందే తప్ప సరైన సమాధానం ఎవ్వరి దగ్గరా లేదు. ఊహాగానాలు మాత్రం బోలెడున్నాయి. అవలా ఉండగా రఫీ తో మాత్రం కొన్నాళ్ళ పాటు ఆయన పాడించలేదు - అది కూడా ఆ ఇద్దరి కాంబినేషన్ లో బోలెడన్ని హిట్స్ వచ్చాకే. ఓ సారి ఓ రికార్డింగ్ లో డిలే అయి, కొంచెం లేట్ గా వచ్చాడు రఫీ. రాగానే క్షమాపణ కోరుకున్నాడు కూడా. కానీ నయ్యర్ దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. అవతలి సంగీత దర్శకుడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు, తనని అవమానించినట్టు ఫీలయ్యాడు. అంతే ... మర్నాటి నుంచి రఫీ కట్. 
OPNAYAR RAFI

రఫీ పాడవలసిన ఎన్నో మంచి పాటలు మహేంద్ర కపూర్ తోను,  మన్నాడే తోను పాడించాడే కానీ రఫీని మాత్రం పిలవలేదు. రఫీ ఆయన గురించి ఎక్కడా నోరు జారలేదు. ఓ సారి ఓ ఫంక్షన్ లో ఇద్దరూ ఎదురు పడ్డారు. పెద్దవాళ్ళు కనబడితే వారి పాదాలను స్పృశించి నమస్కరించడం రఫీకి అలవాటు. ఆ రోజు కూదా నయ్యర్కనిపించగానే ఆయన పాదాలను స్పృశించి నమస్కరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. అంతే గానీ - నన్నేందుకు పిలవటం లేదు - అని అడగలేదు. ఎటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటి భావాలతో మాట్లాడలేదు.  
నయ్యర్ చిన్నబోయాడు రఫీ సంస్కరానికి. ’ఇటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తితోనా తాను ఇన్నాళ్ళూ వైరం పెట్టుకున్నది ? ’ అనుకున్నాడు. అంతే మర్నాటి నుంచి రికార్డింగ్ లకు పిలవడం మొదలుపెట్టాడు. రఫీ కూదా ఇవేవీ అసలు జరగనట్టుగా  తనకిచ్చిన పాటలకు పూర్వంలాగే ప్రాణం పెట్టి పాడేడు.



Comments