Monday, May 26, 2014

పాటలు పాడడం మాటలు కాదు

పాటల ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలన్న కోరిక పాడడం అంతో ఇంతో తెలిసిన ప్రతి వారికి వుంటుంది. పాత రోజులల్లో అయితే శ్రుతి శుద్ధంగా, లయ బద్దంగా పాడడం తప్పనిసరి. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. మనం ఏ శ్రుతిలో పాడినా సంగీత దర్శకుడు తనకు కావల్సిన శ్రుతికి మార్చుకోగలడు. లయ ఎక్కడ తప్పినా ఆ ఆడియో లేయర్ ని కొంచెం అటూ ఇటూ జరిపి లయకి ఎడ్జెస్ట్ చేసుకోగలడు. కాకపోతే ఈ సౌకర్యం ప్రతిభ అస్సలు లేకుండా ఎలాగోలా పైకొచ్చేద్దామనుకుని షార్ట్ కట్ లని ఆశ్రయించే వారి మాత్రం కోసం కాదు. కారాదు. 

ఇదంతా ఎందుకంటే - అసలు ప్రతిభ - అంటే శ్రుతి, లయ, గాత్రాల్ని అదుపులో వుంచుకోవడం, ట్యూన్ ని వీలయినంత త్వరగా గ్రాస్ప్ చేసి సంగీత దర్శలకు వారు కోరుకున్న రీతిలో అందివ్వగలగడం. దీనికి ఈ జనరేషన్ కి అర్ధమయ్యే ఉదాహరణ ఏమిటంటే - ఏక్ నిరంజన్ సినిమాలోఅమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లీ తంబీ ల్లేరు ఏక్ నిరంజన్ పాటలో గాయకుడు తన రెగ్యులర్ గొంతు తో కాకుండా పెక్యులర్ గా, ప్రత్యేకంగా వినిపించాలని మణిశర్మ అనుకన్నారు. ఆయన కోరుకున్నది కోరుకున్న విధంగా అందివ్వగలిగాడు రంజిత్. కనుకనే తర్వాత ఆయన మ్యూజిక్ ఇచ్చిన ఎన్నో సినిమాల్లో పాడే అవకాశాలు పొందగలిగాడు.

వీటన్నిటితో పాటు గాయకుడుకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురాగల అంశం మరొకటుంది. అదే ... వాచకం ...!
ఈ తరం వారు వాడే భాషలో చెప్పాలంటే ... డిక్షన్ ... !! దీనికి ఆ తరం గాయకులు పాడే పద్ధతి గమనిస్తే చాలు. దేవదాసు లో పల్లెకు పోదాం పారుని చూద్దాం పాటలో ప్రొద్దు వాలే ముందుగానే ముంగిట వాలేము’ అని ఉంటుంది. అలాగే రాము సినిమాలోని రా రా కృష్ణయ్యా పాటలో గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం అని వుంటుంది. ఘంటసాలకి తెలుగు భాష క్షుణ్ణంగా తెలుసు కనుక రచయితలు అక్కడ ఎలా రాసారో అలాగే పాడేరు. అంతేగాని - ప్రొద్దు ని పొద్దు గా, గ్రుడ్డివాడు ని గుడ్డివాడు గా మార్చి పాడలేదు.

కానీ ఇవాళ సాహిత్యాన్ని వంట పట్టించుకుని పాడే గాయనీ గాయకులెంతమంది ? యధాతధంగా పాడితే చాలు మీనింగ్ లెందుకు అనే నిర్లిప్తతకి వచ్చేశారు. నిజానికి రచయిత అక్కడ ఏం రాశాడో, ఎందుకు రాశాడో, ఏ పదాన్ని ఎక్కడ ఎలా ఒత్తి పలకాలో తెలుసుకుని పాడితే పాట మరింతగా రాణిస్తుందన్న మౌలిక సూత్రాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఈ విషయాన్ని సినిమాల్లో పాడాలనుకుంటున్న ఔత్సాహిక గాయనీ గాయకులైనా దృష్టిలో పెట్టుకుని పాడితే వారికి మంచి భవిష్యత్తు ఉండి తీరుతుంది. ఉదాహరంకి సప్తపది చిత్రంలోని  గోవుల్లు తెల్లన పాటలో  తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా ... కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా అని రాశారు వేటూరి.

కదుపు అంటే సమూహం. కడుపు అంటే అందరికీ తెలిసినదే. తెల్లటి ఆవులున్న మందలో నల్లటి ఆవులుండవా , నల్లటి ఆవు కడుపున ఎర్రటి ఆవు పుట్టదా అన్నది దాని అర్ధం. ఆ సినిమా వర్ణ వివక్షతకు సంబంధించిన చిత్రం కాబట్టి వేటూరి ఆ వాక్యాలను అంత నర్మగర్భంగా వాడేరు. ఇది తెలుసుకుని పాడేవాళ్ళు
ఎంతమంది ? కదుపు - కడుపు అనే పదాల్లోని శబ్ద సారూప్యాన్ని తెలివిగా వాడుకోగలగటం వేటూరి చమత్కారం. ఇలాటివి తెలుసుకోవాలి కదా ? కొంచెం తెలిసిన వాళ్ళని అడిగితే మురిసిపోతూ మరీ చెప్తారు కదా ? ఎవరూ దొరక్కపోతే నిఘంటువులున్నాయి కదా ? అర్ధం తెలుసుకొని పాడే వారి పట్ల సంగీత దర్శకులు చూపించే గౌరవం ఎంతో గొప్పగా వుంటుంది. ఇవేవీ పట్టించుకోకుండా తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా ... కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా అని పాడేస్తున్నారు చాలా మంది ఔత్సాహిక గాయనీ గాయకులు.

ఈ సందర్భంగా ఎవరికీ తెలియని ఓ విషయం చెప్పాలి.  రచయిత చంద్రబోస్ - ఇవాళ్టికీ ప్రతిరోజూ నిఘంటువు తీసి తనకు తెలియన్ ఓ పదాన్ని తీసుకుని- దీన్ని ఎవరైనా ఎక్కడైనా వాడేరా ... వాడితే ఎలా వాడేరు ... లాంటి పరిశోధనని క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు. రచయితగా ఇంత సక్సెస్ చూశాక కూడా ఇంత శోధన, సాధన అవసరమా అని మనకనిపించొచ్చు. కానీ అవే ఆయనకి రకరకాల ప్రయోగాలు చెయ్యడానికి ఉపయోగపడుతున్నాయని గ్రహించాలి.  కాబట్టి ఏ ఫీల్డ్ కి్ వెళ్ళాలనుకున్నా అందుకు సంబంధించిన విషయ సేకరణ, అది ఎంత వరకు కరక్టు అనే శోధన, అక్కడితో ఆగిపోకుండా అందుకు తగ్గ నిరంతర సాధన వుంటే మన స్థానం ప్రత్యేకంగా వుంటుంది. అసలది మన కోసం కాసుకుని కూచుంటుంది కూడా ... !!!