సంగీత దర్శకుడు చక్రవర్తి, రాఘవేంద్ర రావు కలిసి ఓ సారి తిరుపతికెళ్ళారు. అదే సమయానికి భారత రాష్ట్రపతి జైల్ సింగ్ కూడా తన పర్యటనలో ఓ భాగంగా అక్కడకొచ్చారు. భారత రాష్ట్రపతి కావడం వల్ల సెక్యూరిటీ టైట్ గా వుండడమే కాకుండా ట్రాఫిక్ ని కూడా చాలా రూట్స్ లో మళ్ళించాల్సి వచ్చింది. ఏ రూట్ లో వెళ్ళినా మళ్ళీ వెనక్కి రావడం, మరో రూట్ ట్రై చెయ్యడం ... చక్రవరికి కోపం నసాళానికంటింది. ’జైల్ సింగు తిరపతొచ్చాడూ ... ఓ ... ఓ... ఓ...’ అంటూ గాట్టిగా ఓ రాగం ఎత్తుకున్నారు. ’మళ్ళీ అను’ అని అన్నారు రాఘవేంద్రరావు. సరదాకన్నారనుకుని మళ్ళీ అదే హుషారుతో పాడేరాయన. ’ఈ ట్యూన్ దాచి వుంచు.. మనకి పనికొస్తుంది’ అని అన్నారు రాఘవేంద్రరావు. చక్రవర్తి బిత్తరపోలేదు గానీ రాఘవేంద్ర రావు ఎందుకు చెప్పారో ఏమోనని రికార్డ్ చేసి పెట్టుకున్నారు.
’అడవి సింహాలు’ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో ’ చక్రవర్తీ ... ఆ రోజు తిరపతిలో జైల్ సింగ్ మీద హమ్ చేశావే ... అదోసారి అను’ అని అన్నారు. అలాగే హమ్ చేశారు చక్రవర్తి. ఆ ట్యూన్ కి వేటూరి రాసిన పాటే - ’అగ్గిపుల్ల భగ్గుమంటది, ఆడపిల్ల సిగ్గులంటది’ . సినిమా రిలీజ్ అయ్యాక ఆ రోజుల్లో ఆ పాట ఎంత పాపులరయిందో అందరికీ తెలుసు.
Comments
Post a Comment