’సాగర సంగమం’ సినిమాలోని ’ఓమ్ నమశ్శివాయ’ అనే పాట అందరికీ గుర్తుండే
వుంటుంది. అందులో ’త్రికాలములు నీ నేత్రత్రయమై’ అని రాశారు వేటూరి. అలా రాయడానికి కారణం ఏమిటని అడిగితే - "మనం కాలాల్ని గురించి
చెప్పాలంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అని అంటాం. శివుని మూడు కళ్ళనూ వాటితో
పోల్చిచూసుకుంటూ - కుడి నుంచి ఎడమకి గాని, ఎడమ నుంచి కుడికి గాని
అన్వయిస్తే - ఎలా చూసుకున్నా భవిష్యత్తు మూడో కంటి వైపే వస్తుంది. భవిష్యత్తు మనకి కనబడదు. అదెప్పుడూ శివుని మూడో కన్నులా మూసే వుంటుంది. అందుకే అలా పోల్చడం జరిగింది " అని అంటారాయన.
పెద్దలు చెప్పిన గొప్పగొప్ప విషయాల్ని గుర్తు పెట్టుకుని అవసరార్ధం ప్రయోగించడం వేటూరి ... అందుకు ఉదాహరణే ఈ సంఘటన.
’సాగర సంగమం’ సినిమాలోని ’నాద వినోదము నాట్య విలాసము’ అనే పాట
రికార్డింగ్ జరుగుతోంది. ఆ పాటకి ముందు ’వాగర్ధా వివ సంపృక్తౌ ’ అనే
శ్లోకం వస్తుంది. చాలామందికి ఆ శ్లోకాన్నివేటూరి ఎక్కణ్ణించి తెచ్చారో
తెలియదు. అది కూడా వేటూరే రాశారనుకుంటారు. అది కాళిదాసు రాసిన ’రఘువంశం’
అనే కావ్యం లోనిది. ఆ శ్లోకం చివర ’ వందే పార్వతీ పరమేశ్వరౌ’ అని ఒకసారి ’
వందే పార్వతీప రమేశ్వరౌ’ అని ఇంకోసారి వస్తుంది. అలా రావడానికి కారణం
వుంది. కాళిదాసు కాళికాదేవి భక్తుడు. అందుకే మొదట ఈశ్వరుడికి నమస్కరిస్తూ
’పార్వతీ పరమేశ్వరౌ’ అని అన్నాడు. కానీ ’రఘువంశం’ రాముడికి చెందిన కావ్యం.
విష్ణు పరంగా నమస్కరించి మొదలు పెట్టాలి. అందుకే రెండోసారి ఆ ఇద్దరు
దేవుళ్ళకీ చెందేట్టు ’ పార్వతీప (పార్వతి పతి - శివుడు) రమేశ్వరౌ ( రమ
అంటే లక్ష్మి. లక్ష్మి కి ఈశ్వరుడు విష్ణువు) అని విడగొడుతూనే కలిపి
నమస్కరించాడు.
ఈ సూక్ష్మాన్ని వేటూరి గారికి వారి పెదనాన్న కీ.శే. వేటూరి ప్రభాకర
శాస్త్రి గారు చెప్పారు. వేటూరి ప్రభాకర శాస్త్రి అంటే చాలామందికి తెలియదు.
500 సంవత్సరాలుగా మరుగున పడిపోయిన అన్నమయ్య కీర్తనలను తెలుగు జాతికి
అందించిన ఇద్దరు మహానుభావుల్లో ఒకరాయన. (మరొకరు రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ
... నేటి ప్రముఖ రచయిత్రి, తెలుగు యూనివర్శిటీ ప్రొఫెసర్ సి. మృణాళిని కి
తాతగారు) . ఆ ’నాదవినోదము నాట్య విలాసము’ పాట రికార్డింగ్ లో వేటూరి కి వారి పెదనాన్న చెప్పిన విశ్లేషణ గుర్తొచ్చి , పాడుతున్న
బాలుని ’ఒరె ఒరె ఉండ్రా’ అంటూ రికార్డింగ్ ఆపించి, ఇలా విడగొట్టి పాడమని
చెప్పారు.
Comments
Post a Comment